వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్షణ కోసం, అలాగే కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న వారికి అండగా నిలవడం కోసం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన డిజిటల్ బుక్ ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తలకు రక్షణ కవచంలా నిలవాలని ఉద్దేశంతో రూపొందించిన ఈ యాప్లో తాజాగా ఒక సంచలన ఫిర్యాదు వెలుగులోకి రావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
మాజీమంత్రి విడదల రజినిపై ఫిర్యాదు
పల్నాడు జిల్లాకు చెందిన మాజీమంత్రి విడదల రజినిపై వైసీపీ రూపొందించిన డిజిటల్ బుక్లో ఫిర్యాదు నమోదైంది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఈ ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలో 2022లో రజినీ తన ఇంటి వద్ద, కార్యాలయం వద్ద దాడులు జరిపించారని ఆయన ఆరోపించారు. తన కారు ధ్వంసం, ఇంటి దగ్గర విధ్వంసం జరిగినట్లు పేర్కొంటూ దాడికి సంబంధించిన ఫోటోలు కూడా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు.
రావు సుబ్రహ్మణ్యం ఆరోపణలు
2022 ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఈ దాడులు జరిగాయని, ఆ దాడుల వెనుక మాజీ ఎమ్మెల్యే విడదల రజిని, ఆమె బావమరిది గోపి ఉన్నారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఈ ఘటనపై అప్పటికే చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (111/2022) నమోదు అయినప్పటికీ, ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని వాదించారు.
తన తల్లి రావు చంద్రమతి ఈ ఘటన భయంతోనే పక్షవాతం బారినపడి అనంతరం మరణించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అక్టోబర్ 3 వరకూ గడువు
డిజిటల్ బుక్లో చేసిన ఫిర్యాదును అక్టోబర్ 3, 2025లోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. రజినిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తారా లేక తొలగిస్తారా అన్నదానిపై అందరి దృష్టి నిలిచిందన్నారు.
కార్యకర్తల కోసం పిలుపు
“వైసీపీ పాలనలో రౌడీయిజం, గూండాయిజానికి గురైన ప్రతి ఒక్కరు ఈ డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదులు చేయాలి. నేను కూడా టికెట్ రూపంలో నా ఫిర్యాదును ట్విట్టర్ ద్వారా జగన్ మోహన్ రెడ్డికి నేరుగా పంపాను” అని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. తాను న్యాయం పొందితే, అదే విధంగా పార్టీ కార్యకర్తలకూ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో హాట్ టాపిక్
కార్యకర్తల రక్షణ కోసం ఆవిష్కరించిన యాప్లో సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రిపై ఫిర్యాదు రావడం వైసీపీ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలపై మాజీమంత్రి విడదల రజిని ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.



