వర్షాకాలం రాగానే పాములు, పురుగులు, ఇతర కీటకాలు ఇంటి పరిసరాల్లోకి చేరడం సహజం. చెత్త, చిప్పలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో అవి ఎక్కువగా తలదాచుకుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇంటి లోపల, బాత్రూమ్ లేదా బెడ్రూం వరకు కూడా చేరిపోతాయి. అలాంటి ఘటనలో ఒకటి తాజాగా రాజస్థాన్లో చోటు చేసుకుంది.
అజ్మీర్ జిల్లాలోని పుష్కర్ ప్రాంతంలోని ఒక హోటల్లో నల్లతాచు పాము ప్రత్యక్షమైంది. అది కూడా రెండో అంతస్తులోని టాయిలెట్లో కమ్మోడ్ నుంచి బయటకు రావడంతో అక్కడ కలకలం రేగింది. సుమారు 4 నుండి 5 అడుగుల పొడవున్న ఆ పాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. ఈ దృశ్యాలను హోటల్ సిబ్బంది వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది.
ఈ ఘటనపై హోటల్ సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.



