పాకిస్తాన్‌కు చెందిన ప్రసిద్ధ నటి జవేరియా అబ్బాసీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాస్పదంగానే నిలుస్తూ వచ్చింది. ఆమె చేసిన నిర్ణయాలు, తీసుకున్న అడుగులు ఎన్నోసార్లు వార్తల్లోకెక్కాయి.
1997లో కేవలం 17 ఏళ్ల వయసులోనే జవేరియా తన స్టెప్ బ్రదర్ షమూన్‌ను వివాహం చేసుకోవడం పెద్ద సంచలనం సృష్టించింది. ఈ బంధంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తినా, వారు బయోలాజికల్ సిస్టర్-బ్రదర్ కాదన్న కారణంతో కొంతమంది సమర్థించారు. ఈ వివాహంతో జవేరియాకు సొంత తల్లే అత్తగా మారింది. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ, “సొసైటీని, తల్లి కోరికను దృష్టిలో పెట్టుకుని మంచి కోడలిగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను” అని చెప్పింది.
అయితే, సమాజం చూపిన వ్యతిరేకత, ఎగతాళి తట్టుకోలేక చివరికి షమూన్కు విడాకులు ఇచ్చింది. ఈలోగా వారికి పుట్టిన కుమార్తె అంజెలాను జవేరియా ఒంటరి తల్లిగా పెంచింది. తన సంపాదనతోనే కూతురి భవిష్యత్తు తీర్చిదిద్దింది.
అంజెలా సెటిల్ అయిన తర్వాత, 51 ఏళ్ల వయసులో జవేరియా మళ్లీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకుంది. 2024లో బిజినెస్‌మ్యాన్ అడీల్ హైదర్‌ను వివాహం చేసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో కుమార్తె ప్రోత్సాహమే ప్రధాన కారణమని ఆమె తెలిపింది. ఈ సారి కూడా కొంత విమర్శను ఎదుర్కొన్నప్పటికీ, అభిమానుల మద్దతు, అత్తారింటి ఆప్యాయత ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాయి.
జవేరియా అబ్బాసీ జీవితం ఎప్పుడూ సవాళ్లతో, చర్చలతో నిండిపోయినా, తనకిష్టమైన మార్గాన్ని ఎంచుకోవడంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.



