మంగళగిరి పట్టణంలోని ఆర్.ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం “నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగోను సినీ ప్రముఖులు డాక్టర్ గౌతమ్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సంఘం తరఫున రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రతి ల్యాబ్ సభ్యునికి ధన్యవాదాలు తెలిపారు.
అసోసియేషన్ లక్ష్యాలు – సభ్యుల కోసం సమగ్ర కార్యక్రమాలు
అసోసియేషన్ అధ్యక్షులు తాడేకోరు శ్రీహరి బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 20 నుండి 25 వేల ప్రైవేట్ మెడికల్ లాబరేటరీలను ఒకే వేదికపైకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. లాబ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రతి మూడు నెలలకు ఒకసారి టెక్నీషియన్లకు శిక్షణా సెమినార్లు నిర్వహించడం, ల్యాబ్ యజమానులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం, అలాగే మారుమూల ప్రాంతాల పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య నిర్ధారణ పరీక్షలు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని వివరించారు.
కార్పొరేట్ కంపెనీల మోసపూరిత ప్రకటనలపై ఆవేదన
కొన్ని కార్పొరేట్ సంస్థలు ₹299/₹399 ప్యాకేజీలు పేరుతో ఆన్లైన్లో మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపార సాధనంగా మార్చుకుంటున్నాయనే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నిజమైన నాణ్యమైన నిర్ధారణ పరీక్షలు అందించడమే కాకుండా, ఈ విషయంలో అవగాహన కల్పించడం కూడా తమ అసోసియేషన్ బాధ్యత అని శ్రీహరి బాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
ప్రైవేట్ లాబరేటరీలకు కూడా ఆరోగ్యశ్రీ పథకంలో భాగస్వామ్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్లను కోరారు. ఇలా చేస్తే రాష్ట్రంలోని 20వేల లాబరేటరీలు, వాటి వెనుక ఉన్న కుటుంబాలు జీవనోపాధి పొందే అవకాశం ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కొల్లి బ్రహ్మయ్య, అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆనం సంజీవరెడ్డి, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దుర్గాప్రసాద్, కోశాధికారి నారాయణరావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, జిల్లా–మండల స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.



