నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియా నిషేధంపై యువత పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో, ఆ ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా పదవులను వదిలారు. ఈ పరిణామాలతో నేపాల్‌లో మళ్లీ రాచరికం పునరుద్ధరణపై చర్చ మొదలైంది. చాలా మంది నేపాలీలు మరోసారి రాజు పాలన రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంలో, 2001లో దేశాన్ని కుదిపేసిన “రాజ కుటుంబం ఊచకోత” మళ్లీ ప్రజా చర్చకు వస్తోంది. అదే సంఘటన నేపాల్‌లో రెండు శతాబ్ధాల రాజరికానికి ముగింపు పలికింది. 2008లో ప్రజాస్వామ్య రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
నారాయణహితి ప్యాలెస్‌లో ఘోరమైన రక్తపాతం
2001 జూన్ 1. ఖాట్మాండులోని నారాయణహితి ప్యాలెస్‌లో ప్రతి శుక్రవారం లాగే రాజ కుటుంబం సంతోషంగా సమావేశమైంది. కానీ ఆ రాత్రి ఆ ఆనంద క్షణాలు రక్తపాతం మారుతాయని ఎవరికీ తెలియదు. యువరాజు దీపేంద్ర బీర్ బిక్రమ్ షా మద్యం మత్తులో పార్టీని వదిలి బయటికి వెళ్లి, కొద్దిసేపటికి కమాండో దుస్తులు ధరించి, రైఫిల్ పట్టుకుని తిరిగి వచ్చాడు. తన తండ్రి, రాజు బీరేంద్ర సహా కుటుంబ సభ్యులపై తుపాకీ కాల్పులు జరిపాడు.
రాజు బీరేంద్ర చివరి శ్వాస విడుస్తూ “ఏం చేశావు..?” అని అన్నారు. ఆ క్షణం మొత్తం రాజ కుటుంబం మీద దాడి కొనసాగి, రాణి ఐశ్వర్య, సోదరి శృతి, తమ్ముడు నిరాజన్తో పాటు మరో ఐదుగురి ప్రాణాలు పోయాయి. చివరకు తనపై తానే కాల్చుకున్న దీపేంద్ర, తీవ్రమైన గాయాలతో కోమాలోకి వెళ్లాడు. ఆసుపత్రిలో ఉండగానే తాత్కాలికంగా రాజుగా ప్రకటించబడ్డాడు. కానీ జూన్ 4న మరణించాడు.
తరువాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర రాజ్యభారాన్ని స్వీకరించాడు. ఆయన 2008 వరకు చివరి రాజుగా కొనసాగారు. రాజ్యాంగ సవరణలతో రాచరికానికి శాశ్వతంగా తెరపడింది.
ప్రేమ – రాజకీయం – అధికారం: ఊచకోత వెనక నిజం
ప్రభుత్వం చేసిన విచారణలో ఈ ఊచకోత వెనుక “ప్రేమకథ” కారణమని తేలింది. యువరాజు దీపేంద్ర, దేవయాని రాణా అనే యువతిని ప్రేమించాడు. ఆమె నేపాల్ రాజకీయ నాయకుడు పశుపతి షంషేర్ జంగ్ బహదూర్ రాణా కుమార్తె. తల్లి ఉషా రాజే సింధియా, గ్వాలియర్ రాజవంశానికి చెందిన వారు. ఆమె మాధవరావు సింధియా, వసుంధర రాజేలకు బంధువు.
దీపేంద్ర-దేవయాని యూకేలో పరిచయం అయ్యారు. కానీ రాజ కుటుంబం ఈ ప్రేమకు గట్టి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాణి ఐశ్వర్య ఈ సంబంధాన్ని అడ్డుకున్నారు. దేవయాణిని పెళ్లి చేసుకుంటే యువరాజు హోదాను కోల్పోవాలని హెచ్చరించారని చెబుతారు. భారత రాజ కుటుంబంతో పెళ్లి జరగడం వలన భారత్ ప్రభావం పెరుగుతుందని, ఆ ప్రభావం నేపాల్ స్వాతంత్ర్యంపై భారంగా మారుతుందని భయపడ్డారని చెప్పబడింది.
అలా ప్రేమ, రాజకీయాలు, అధికారం మిళితమైన ఈ సంఘటన నేపాల్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. రాచరికానికి తెరదించిన ఆ రక్తపాతం, ఈరోజు కూడా నేపాల్ చరిత్రలో గాఢమైన గాయం లాంటి గుర్తుగా మిగిలింది.



