ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట.. ఫోటోలు, పేరును దుర్వినియోగం చేసినవారిపై కఠిన చర్యలు

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఆమె అనుమతి లేకుండా కొందరు తన పేరు, ఫోటోలు, కీర్తిని వాణిజ్యపరమైన, ముఖ్యంగా అశ్లీల ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఐశ్వర్య వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. వాదనలు విన్న కోర్టు, ఆమె వ్యక్తిత్వ హక్కులకు రక్షణగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని స్పష్టం చేసింది.

జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఐశ్వర్య తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపించారు. ఆయన మాట్లాడుతూ, కొన్ని ఆన్‌లైన్ సంస్థలు మరియు వ్యక్తులు నటి కీర్తిని దెబ్బతీస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ప్రయోజనాలకు వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. “ఐశ్వర్య పేరు, ముఖాన్ని ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండనీయమైన విషయం” అని ఆయన అన్నారు.

ఇక ‘ఐశ్వర్య నేషన్ వెల్త్’ అనే ఒక సంస్థ, తమ లెటర్‌హెడ్‌పై ఆమె ఫొటోను ముద్రించి, ఆమెను ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌గా చూపించడం కూడా న్యాయవాది ప్రస్తావించారు. అంతేకాకుండా, మరికొందరు ఐశ్వర్య చిత్రాలతో టీషర్టులు, వాల్‌పేపర్లు అమ్ముతూ ఆమె వ్యక్తిగత హక్కులను ఉల్లంఘిస్తున్నారని వాదించారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ కరియా, ప్రతివాదులపై తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని స్పష్టం చేశారు. అయితే పూర్తి ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.

ఈ కేసు తదుపరి విచారణను జనవరి 15, 2026కు వాయిదా వేశారు. ఇదే తరహాలో గత మేలో నటుడు జాకీ ష్రాఫ్ వేసిన పిటిషన్‌పై కూడా ఢిల్లీ హైకోర్టు అనుకూల ఉత్తర్వులు ఇచ్చిన విషయం గమనార్హం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి