ఆంధ్రప్రదేశ్‌లో 2024 జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ఏర్పాటైన వెంటనే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అయితే రాజ్యాంగ పరంగా చూసుకుంటే “ఉప ముఖ్యమంత్రి” అనే ప్రత్యేక హోదా లేదు. రాజ్యాంగం ప్రకారం మంత్రిగా మాత్రమే ఆయన ప్రమాణం చేశారు. కానీ, ప్రభుత్వ ప్రకటనతో ఆయనను ఉప ముఖ్యమంత్రిగా పిలుస్తున్నారు. ఇదే పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా కనిపిస్తోంది. అయితే అక్కడి పరిస్థితులు, ఇక్కడి పరిస్థితులు వేరు అని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు – నియమం ఏమిటి?
దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాల్సిన ఫోటోలు ఒక విధి విధానం ప్రకారం ఉంటాయి. వాటిలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రుల చిత్రాలకే స్థానం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ క్రమానికి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక ఎలాంటి చట్టబద్ధత ఉందో, లేదా ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయో అనే అంశం ఇప్పుడు కోర్టు దృష్టికి వెళ్లింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
విజయవాడకు చెందిన రైల్వే శాఖ రిటైర్డ్ ఉద్యోగి వై. కొండలరావు ఈ విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ చిత్రాలను ఏ ఆధారంపై ఉంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. ముందుగా సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వివరాలు అడిగిన ఆయనకు, సమాచార & పౌర సంబంధాల శాఖ ఎలాంటి ఉత్తర్వులు లేదా సర్క్యులర్లు జారీ చేయలేదని స్పష్టంగా తెలిపింది. ఈ సమాధానంతో సంతృప్తి చెందని కొండలరావు న్యాయస్థానం ఆశ్రయించారు.
రాజ్యాంగబద్ధం కాని పదవి – సుప్రీం మార్గదర్శకాలు
తన పిటిషన్‌లో కొండలరావు, ఉప ముఖ్యమంత్రి అనే పదవి రాజ్యాంగబద్ధం కాదని వాదించారు. అదేవిధంగా ప్రజా ధనం ఉపయోగించి రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రతిష్ట పెంచడం సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని గుర్తు చేశారు. ప్రజా డబ్బును వాడి ఎవరి వ్యక్తిగత కీర్తిని పెంచకూడదనే అంశంపై సుప్రీం కోర్టు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చిందని తెలిపారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించాలనీ, ప్రభుత్వం ఒక విధి విధానం రూపొందించే వరకు ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరారు.
ప్రతివాదులుగా పవన్ కళ్యాణ్ సహా అధికారులు
ఈ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగ ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సమాచార & పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ఆధ్వర్యంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది.



