నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు: 19 మంది మృతి, కేపీ శర్మ ఓలీ రాజీనామా

నేపాల్‌లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. దేశంలో సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు, ముఖ్యంగా యువత, పెద్ద ఎత్తున ఆందోళనలకు తెరలేపారు. నిరసనలు మొదట శాంతిగా ప్రారంభమైనప్పటికీ, దాదాపు కొన్నిరోజుల్లో హింసాత్మకంగా మారాయి. పోలీసుల చర్యలలో 12 ఏళ్ల బాలుడు సహా 19 మంది ప్రాణాలు కోల్పోగా, 347 మంది గాయపడ్డారు. ఖాట్మండు సహా ప్రధాన నగరాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, రెండు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ, ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయనతో పాటు హోం మంత్రి రమేష్ లేఖక్, వ్యవసాయ శాఖ మంత్రి రామ్ నాథ్ అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి సహా ఐదుగురు మంత్రులు కూడా రాజీనామా చేశారు.

తాజా ఘటనలో మరీ తీవ్రమైన దారుణం చోటు చేసుకుంది. నేపాల్ మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు దాడి చేసి నిప్పంటించారు. ఇంట్లో ఉన్న ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రా కార్ సజీవంగా దహనమయ్యారు. నిరసనకారులు ఆమెను బంధించి ఇంటికి నిప్పటించారని పోలీసులు తెలిపారు.

అయితే సామాజిక మాధ్యమాలపై నిషేధం తొలగించబడినప్పటికీ, ఆందోళనలు ఆగలేదు. నిరసనకారులు ప్రధాని నివాసం, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడి చేసి నిప్పంటించగా, ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌ను కూడా కొట్టిపారేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆయన తీవ్ర గాయాలపాలయ్యారని సమాచారం.

ప్రధాని రాజీనామాతో నేపాల్‌లో పాలన పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయి. రాజీనామా కొంత ముందే, కేపీ శర్మ ఓలి నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం ఓలీ దుబాయ్‌కి వెళ్లనున్నారని సమాచారం.

ఇకనేపాల్‌లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలను హెచ్చరించింది. స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసే మార్గదర్శకాలను కచ్చితంగా పాటించమని ఆదేశించింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి