జర్నలిజం అంటే వృత్తి కాదు – సమాజానికి అక్షరయోధుల పోరాటం

జర్నలిజం అనే వృత్తి స్వతంత్రం, సత్యం, ధైర్యం అనే మూడు స్థంబాలపై నిలబడే పోరాటం. ఒక జర్నలిస్టు జీవితంలో విమర్శలు అంటే బలహీనత కాదు, అదొక ఆయుధం. జర్నలిస్టు మీద విమర్శలు లేవంటే, అతని కలం ఇంకా పదును కోల్పోయిందని అర్థం చేసుకోవాలి. సమాజంలో జరుగుతున్న అక్రమాలను భయపడి రాయకపోతే, జర్నలిస్టు తన వృత్తికి న్యాయం చేయలేడు. నిజమైన జర్నలిస్టు అనేది పరిశోధన చేసి, పరిశీలించి, పక్కా ఆధారాలతో రాసే వాడే. భయపడే జర్నలిస్టు సమాజానికి గౌరవం ఇవ్వడమే కాకుండా తన వృత్తిని అవమానపరచినట్లే.

జర్నలిజం వృత్తి అని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. ఇది వృత్తి కంటే ముందుగా సామాజిక బాధ్యత. కానీ నేటి పరిస్థితుల్లో ఆ బాధ్యతలు చాలా వరకు కనుమరుగయ్యాయి. మీడియా కొంతమంది అవినీతిపరుల చెరలో చిక్కి, ఒక దోపిడీ వ్యవస్థగా మారింది. గతంలో రాజకీయరంగాన్నే అత్యంత అవినీతి కేంద్రమని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో మీడియా ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు.

జర్నలిస్టుల జీవితం చాలా కఠినమైనది. గడియారంలో సెకన్ల ముల్లులా 24 గంటలు పరుగు తీస్తూనే ఉండాలి. ఆకలి వేసినా తినడానికి సమయం ఉండదు. చీకటి వేళలో మానసిక ఒత్తిడి వెంటాడుతుంది. ఉదయం తిరిగి అదే పరుగులు. ఒకవైపు ఒంటరితనం, మరోవైపు వెన్నుపోట్లు, కుటిల రాజకీయాలు రోజువారీ సమస్యలుగా మారుతాయి. కష్టానికి సరైన ఫలితం వస్తుందనే నమ్మకం ఉండదు. అయినా తమ కుటుంబం కోసం, కనీసం ఒక్క పూట అన్నం పెట్టే ఆశతో ఈ వృత్తిలో నిలబడాల్సి వస్తుంది.

జర్నలిజం అంటే యుద్ధరంగం. ప్రతిరోజూ కనిపించని శత్రువులతో పోరాటం చేయాలి. ఈ పోరులో నిలబడేవారికి ఓపిక, సహనం, గుండె ధైర్యం తప్పనిసరిగా కావాలి. భయపడేవారు ఇక్కడ నిలబడలేరు. నిజాయితీ, నీతి, విలువలతో పోరాడే వాడు మాత్రమే నిజమైన జర్నలిస్టు. కానీ కులబలం, ధనబలం ఆధారంగా ఎదగాలనే ప్రవణతతో చాలా మంది ఇక్కడ కుదేలవుతున్నారు.

ఇంకా ఒక సత్యం ఏమిటంటే, ఈ రంగంలో మేధాశక్తి, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను చేరగలరు. ఒకప్పుడు పిల్లలు “డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను” అనేవారు. ఇప్పుడు చాలామంది అనుకోకుండా, లేక వేరే మార్గం లేక ఈ వృత్తిలోకి అడుగుపెడుతున్నారు. దేశంలోనే అత్యంత కఠినమైన వృత్తి ఇదే అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయినా అక్షరంపై ప్రేమ, అక్షరం తో సమరం చేయాలనే తపన ఉన్నవారు ఇక్కడే ఉండాలి.

జర్నలిజం ఒక ఛాలెంజ్. దీనిని తట్టుకుని నిలబడే వాడు ఎక్కడైనా, ఏ పరిస్థితిలోనైనా గెలవగలడు. అందుకే జర్నలిజం అనేది కేవలం ఉద్యోగం కాదు, అది ఒక యజ్ఞం. సమాజం కోసం పోరాడే అక్షరయోధులకే ఇక్కడ స్థానం ఉంది. నిజాయితీ, ధైర్యం, పట్టుదల, విలువలతో ముందుకు సాగితే జర్నలిస్టు కేవలం వృత్తిలోనే కాదు, సమాజంలోనూ చిరస్మరణీయుడవుతాడు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి