స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్ఫాఫ్ మళ్లీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్న సందర్భంలో ఆమె ఈ అభ్యర్థన చేయడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. వయసు మీదపడుతున్న కారణంగా ఈ చారిత్రక అంశానికి త్వరగా ముగింపు లభించాలని ఆమె భావోద్వేగంగా కోరుతున్నారు.
జర్మనీలో నివసిస్తున్న 82 ఏళ్ల అనితా బోస్, జాతీయ మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని మోదీని నేరుగా కలిసే అవకాశం వస్తే, నా తండ్రి అస్థికలను భారత్‌కు తీసుకురావాలని కచ్చితంగా కోరుతాను. గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నించినా, అది పూర్తికాలేదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తే, అది మా కుటుంబానికే కాకుండా దేశానికి గొప్ప సంతృప్తినిస్తుంది” అని పేర్కొన్నారు.
“ఈ సమస్యను నేను నా జీవితకాలంలోనే ముగించాలని కోరుకుంటున్నాను. దీన్ని నా కుమారుడికి వారసత్వంగా వదిలి పెట్టే ఉద్దేశ్యం నాకు లేదు” అని ఆమె స్పష్టం చేశారు. ఇది కేవలం కుటుంబ సంబంధిత అంశం కాదని, సుభాష్ చంద్రబోస్ యావత్ భారతదేశానికే చెందిన మహానేత అని ఆమె గుర్తుచేశారు.
1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు అనేక జాతీయ, అంతర్జాతీయ విచారణలు నిర్ధారించాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడి సైనిక ఆసుపత్రిలో కన్నుమూశారని చరిత్రకారుల నివేదికలు పేర్కొన్నాయి. అనంతరం ఆయన అస్థికలను జపాన్‌లోని టోక్యోలో ఉన్న రెంకోజీ బౌద్ధ ఆలయంలో ఒక ప్రత్యేక కలశంలో భద్రపరిచినట్లు విశ్వాసం.



