అమరావతిపై దుష్ప్రచారం తగదు – సదస్సులో నిపుణులు, మేధావుల స్పష్టం

విజయవాడ:
అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆటంకం కలుగజేస్తోందని పలువురు నిపుణులు, మేధావులు అభిప్రాయపడ్డారు. గురువారం విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో “అమరావతి పై అబద్ధపు ప్రచారం – భావప్రకటన స్వేచ్ఛ” అనే అంశంపై సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా ప్రధాన వక్తగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ టీ. సునీల్ చౌదరి మాట్లాడుతూ – భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అయినప్పటికీ, దానికి సంబంధించిన బాధ్యతలు కూడా మనందరి మీద ఉంటాయని అన్నారు. అబద్ధపు వార్తలతో సమాజంలో విద్వేషాలు రాకూడదని, పత్రికారంగపు విలువలను కాపాడటం అత్యంత ముఖ్యమని ఆయన సూచించారు. ముట్నూరి కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావు, సి. రాఘవాచారి, ఎబికె ప్రసాద్ వంటి ప్రముఖ జర్నలిస్టులు పాటించిన విలువలు నేటి జర్నలిజంలో మరుగున పడిపోతున్నాయన్న ఆవేదనను వ్యక్తం చేశారు.

సభకు అధ్యక్షత వహించిన సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్‌కుమార్ మాట్లాడుతూ – రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అవసరం ఏర్పడిందని, ఆ సందర్భంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. అయితే 2019 తర్వాత అమరావతిపై దుష్ప్రచారం ఊపందుకుందని, వర్షాలతో అమరావతి మునిగిపోయిందనే ఒక తప్పుడు ప్రచారం కూడా కొనసాగుతోందని విమర్శించారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధపు ప్రచారం చేయడం రాజ్యాంగ పరిమితులకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

నీటిపారుదల నిపుణులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ – వర్షాలు, వరదలు సహజసిద్ధమని, కేరళ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కూడా ఇలాంటి సమస్యలు తరచూ ఎదురవుతాయని గుర్తు చేశారు. అమరావతి ప్రాంతంలో వర్షపు నీటిని నిల్వ చేసుకునే విధంగా ఆనకట్టలు, ప్రాజెక్టులు అవసరమని సూచించారు.

ప్రఖ్యాత చరిత్రకారుడు పాపినేని సాయి మాట్లాడుతూ – అమరావతికి వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం ఉందని, బౌద్ధ-జైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన ఈ ప్రాంతం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.

అమరావతి రైతు నాయకుడు జొన్నలగడ్డ కిరణ్ మాట్లాడుతూ – అమరావతి కేవలం రైతుల రాజధాని కాదని, యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలన్ని తట్టుకుని అమరావతిని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చరిత్రకారులు, రైతు నాయకులు, జర్నలిస్టులు, జేఏసి ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి