ఆంధ్రప్రదేశ్‌లో శతాబ్దాలుగా కొనసాగుతున్న వింత పెళ్లి ఆచారం

వివాహ వేడుకల్లో ఆనందం, సంబరాలు, సంప్రదాయాలు, సరదా కార్యక్రమాలు సహజమే. కానీ వైఎస్సార్ కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఒక విశేషమైన ఆచారం కొనసాగుతూనే ఉంది. ఇది చూసే వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక్కడి ‘బూచుపల్లె’ వంశీయుల పెళ్లిళ్లలో వధువు మెడలో తాళి కట్టిన వెంటనే వరుడికి మూడు కొరడా దెబ్బలు తప్పనిసరిగా వేస్తారు. ఈ ప్రత్యేక ఆచారం శతాబ్దాలుగా వారి వంశంలో కొనసాగుతోంది.

ఆచారానికి వెనుక ఉన్న కథ

స్థానికుల కధనం ప్రకారం, వందల ఏళ్ల క్రితం వీరి పూర్వీకులు గంగమ్మ ఆలయం నుంచి పొరపాటున ఓ పెట్టెను ఇంటికి తెచ్చుకున్నారని చెబుతారు. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఐదు కొరడాలు దొరికాయి. ఈ తప్పును గుర్తించిన వారు గంగమ్మ తల్లిని ప్రార్థించగా, అమ్మవారు ప్రత్యక్షమై క్షమించినట్టు చెబుతారు. కానీ ఒక షరతు పెట్టారు – ఇకపై వారి వంశంలో జరిగే ప్రతి పెళ్లిలో వరుడికి మూడు కొరడా దెబ్బలు తప్పనిసరిగా వేయాలని ఆజ్ఞాపించిందని స్థానికులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

అప్పటి నుంచి తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. గంగమ్మ ఆజ్ఞగా భావిస్తూ, నేటికీ బూచుపల్లె వంశీయులు ఈ సంప్రదాయాన్ని గౌరవంగా పాటిస్తున్నారు.

నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం

ఈ వంశానికి చెందిన వారు వైఎస్సార్ కడప జిల్లాలోని భద్రంపల్లె, లోమడ, బూచుపల్లె, బోడివారిపల్లె, మల్లేల, తొండూరు, ఇనగలూరు, సంతకొవ్వూరు, అగడూరు గ్రామాల్లో నివసిస్తున్నారు. సుమారు వెయ్యి కుటుంబాలు నేటికీ తమ పెళ్లిళ్లలో ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ, తమ పూర్వీకుల మాటను నిలబెట్టుకుంటున్నారు.

ఇలా, సాధారణంగా ఆనందం, ఉత్సాహం నిండిన వివాహ వేడుకలో భాగంగా మూడు కొరడా దెబ్బలు కూడా శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయంగా మారి, ప్రత్యేకతను సంతరించుకుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి