రాచకొండ పోలీసులు పునరావాసం కల్పించిన మాజీ మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్

నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కాకరాల సునీత, చెన్నూరి హరీశ్‌లు తాజాగా ప్రజాస్రవంతిలోకి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి పునరావాసం కల్పించేందుకు రాచకొండ పోలీసులు ముందడుగు వేశారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్వయంగా వీరికి ఆర్థిక సహాయం అందజేశారు. సునీతకు రూ. 20 లక్షల చెక్కు, హరీశ్‌కు రూ. 4 లక్షల చెక్కు అందించారు. అదేవిధంగా, వీరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించే దిశగా ప్రత్యేక కృషి చేస్తామని సీపీ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ – “మావోయిజం సిద్ధాంతానికి కాలం చెల్లింది. ఒకప్పుడు జీవనోపాధి మార్గాలు లేక చాలామంది ఆ దారిని ఎంచుకున్నారు. కానీ నేటి తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అభివృద్ధి, అవకాశాలు విస్తరించాయి. మావోయిస్టు భావజాలం ఆకర్షణ కోల్పోయింది. కొందరు యువత ఆ మార్గం వైపు వెళ్లినా, ఎక్కువ మంది తిరిగి వచ్చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 387 మంది నక్సలైట్లు లొంగిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కాకరాల సునీత జీవితకథ మావోయిజం చరిత్రలో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు 40 సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన ఆమె, ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ జీవిత భాగస్వామి. సునీత ప్రముఖ సినీ నటుడు, విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు కాకరాల సత్యనారాయణ కుమార్తె. ఆమె 1986లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. మొదటి భర్త టీఎల్ఎన్ చలం కూడా అన్నపురం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సునీత సోదరి మాధవి ఇంకా మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతున్నారని పోలీసులు వెల్లడించారు.

ఇక చెన్నూరి హరీశ్ మావోయిస్టు అగ్రనేతలకు దగ్గరగా పనిచేస్తూ, వారి అనుచరుడిగా వ్యవహరించారని అధికారులు వివరించారు. ఇద్దరికీ లభించిన పునరావాస ప్యాకేజీలు వారి జీవితంలో కొత్త ఆరంభానికి దోహదపడతాయని రాచకొండ పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి