తెలంగాణకు మరోసారి భారీ వర్షాల ముప్పు – నేడు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

telangana-red-orange-alert-heavy-rains-august-2025

తెలంగాణ రాష్ట్రం మరోసారి భారీ వర్షాల ముప్పును ఎదుర్కొంటోంది. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇప్పటికే రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ మళ్లీ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రెడ్ అలర్ట్ జిల్లాలు

నేడు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు

ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

హైదరాబాద్‌లో వరద ప్రభావం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో హైదరాబాద్‌లో వరద పరిస్థితులు మరింత విషమించాయి. హిమాయత్ సాగర్ జలాశయానికి పెద్ద మొత్తంలో వరదనీరు చేరడంతో అధికారులు 10 గేట్లు ఎత్తివేసి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. దీంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చి పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

కుల్సుంపురా వద్ద మూసీ నది రోడ్డంతా నీటిలో మునిగిపోవడంతో వాహన రాకపోకలు నిలిపివేశారు. పురాణ ఫుల్ స్మశాన వాటికలోకి కూడా వరదనీరు చేరడంతో అంత్యక్రియలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ప్రజల తరలింపు చర్యలు

మూసీ పరివాహక ప్రాంతాలైన జియాగూడ, పురానా ఫూల్ రోడ్డు, చాదర్ ఘాట్, శంకర్ నగర్ బస్తీలలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ముంపునకు గురైన ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అధికారులు ఇచ్చిన సూచనలు

వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరంలేకుండా బయటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి