ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఇకపై సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
మొదటగా ఈ నిర్ణయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెలవైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమలు కానుంది. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని వందకు పైగా ప్రధాన ఆలయాలకు విస్తరించనున్నారు. ఈ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక నోడల్ అధికారులను కూడా నియమించనున్నారు.
ఏం ఏం నిషేధం?
- 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు
- ప్లాస్టిక్ బాటిళ్లు
- డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు
- ఒకసారి వాడి పారేసే అన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులు
ఇవే ఉపయోగించాలి
ప్లాస్టిక్కు బదులుగా పర్యావరణహితమైన వస్తువులు వినియోగించాలని దేవాదాయ శాఖ సూచించింది.
- ప్రసాదం – స్టీల్ ప్లేట్లు లేదా అరిటాకులలో మాత్రమే వడ్డించాలి
- తీసుకెళ్లేందుకు – పేపర్ బ్యాగులు లేదా క్లాత్ బ్యాగులు ఉపయోగించాలి
- పానీయాలు – స్టీల్ మగ్గులు, టంబ్లర్లు వినియోగించాలి
తిరుమల మోడల్ అమలు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. లడ్డూల కోసం బయోడీగ్రేడబుల్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా ఆర్వో వాటర్ సౌకర్యం అందిస్తోంది. ఇప్పుడు అదే విధానాన్ని రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో అమలు చేయనున్నారు.
పర్యావరణ ప్రయోజనాలు
ప్రభుత్వం ఈ నిర్ణయంతో రెండు ముఖ్య ప్రయోజనాలను ఆశిస్తోంది:
- ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపు
- పర్యావరణహిత ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం
ఇప్పటికే నిర్ణయం, కానీ…
గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2022 జూలైలోనే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఆ జాబితాలో శ్రీశైలం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం వంటి ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి.
ఇప్పుడు కొత్తగా కనకదుర్గమ్మ ఆలయం నుంచి ప్రారంభించి ఈ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించడంతో, ఈసారి నిర్ణయం సఫలమవుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.



