సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో సంతానం కోసం వెళ్లిన దంపతులకు, వేరొకరి వీర్య కణాలతో చికిత్స జరగడం తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. డీఎన్ఏ పరీక్ష ద్వారా ఈ మోసం వెలుగు చూసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సెంటర్ నిర్వాహకురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరంలోని పలు స్పెర్మ్ క్లినిక్‌లపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక్కదొంగదండా బయటపడింది. సదరు క్లినిక్ అనుమతులు లేకుండా పనిచేస్తున్నట్లు, నిర్దిష్ట ప్రమాణాలు పాటించకుండా వీర్యాన్ని సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఇండియన్ స్పెర్మ్ క్లినిక్ అనే సెంటర్, పలువురు వ్యక్తుల నుంచి వీర్యం సేకరిస్తోంది. ఒక్కసారి వీర్య దానం చేస్తే దాతకు రూ.4,000 చెల్లిస్తున్నట్లు గుర్తించారు. సేకరించిన వీర్యాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలిస్తూ, అక్కడ ఉన్న దంపతులకు పిల్లలు పుట్టేలా చికిత్స నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో అధికారులు కేసు నమోదు చేశారు. సెంటర్ నిర్వాహకులతో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంతాన సాఫల్య కేంద్రాలు, స్పెర్మ్ క్లినిక్‌లపై అధికారులు దృష్టి సారించారు. అనుమతుల్లేని IVF సెంటర్లపై ప్రత్యేక పరిశీలనలు, సోదాలు నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది.



