అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (MEGA PTM) ప్రపంచంలోని అతిపెద్ద పీటీఎంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఈ గౌరవాన్ని ఉపాధ్యాయులకు అంకితమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
గిన్నిస్ బుక్ ప్రకారం, ఈ సమావేశంలో 53.4 లక్షల మంది పేరెంట్స్ మరియు టీచర్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) సభ్యులు సహా మొత్తం 1.52 కోట్లు (15.2 మిలియన్లు) పైగా ఈ ఘనతలో భాగమయ్యారు.
జాతీయ విద్యా విధాన వేడుకకు ముందు ఘనత:
జూలై 29న జరగబోయే జాతీయ విద్యా విధాన (NEP) 5వ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు MEGA PTM గిన్నిస్ రికార్డు సాధించడం సంతోషకరమని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యను అందించేందుకు రాష్ట్రం చేస్తున్న కృషికి ఇది ప్రోత్సాహం అని చెప్పారు.
ఉపాధ్యాయుల కృషికి మంత్రి ప్రశంస:
మెగా పీటీఎం విజయవంతానికి ఉపాధ్యాయులు వేసిన శ్రమను మంత్రి లోకేష్ ప్రశంసించారు. ఈ ఘనత సాధనకు తోడ్పడిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష అధికారులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, దాతలు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గిన్నిస్ రికార్డు నమోదు ప్రక్రియ:
MEGA PTMకు సంబంధించిన సమాచారం LEAP యాప్ ద్వారా సేకరించబడింది. ఇందులో మూడు ఫోటోలు, ఒక వీడియో, ప్రతి స్కూల్ నుండి స్వతంత్ర సాక్షుల నివేదికల ఆధారంగా డేటాను సమకూర్చారు. గిన్నిస్ సంస్థ నియమించిన 40 మందికి పైగా ఆడిటర్లు, 61,000 పాఠశాలల డేటాను విశ్లేషించి రికార్డును ధ్రువీకరించారు. గిన్నిస్ ధ్రువపత్రం ఆగస్టు రెండవ వారంలో ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా అందజేయనున్నారు.
అత్యద్భుత ప్రోత్సాహం – సమగ్ర శిక్ష డైరెక్టర్ బి. శ్రీనివాసరావు:
AP మోడల్ ఎడ్యుకేషన్ కింద అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ గిన్నిస్ అవార్డు ఉపాధ్యాయుల కృషికి ప్రతిఫలం కావడమే కాకుండా, ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ఇది అత్యంత గొప్ప ప్రోత్సాహమన్నారు.



