పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చారిత్రక పౌరాణిక చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజుకు సిద్ధమవుతోంది. అయితే సినిమా విడుదల దగ్గర పడుతున్న తరుణంలో నెగిటివ్ ప్రచారాలు, తప్పుడు వార్తలు, బజ్ లేదంటూ రూమర్లు సినిమాపై గుబురుపడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, ఈ ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“టికెట్ రేట్లు, డిస్ట్రిబ్యూషన్ విషయంలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. సినిమాకు బజ్ లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని, విడుదలకే అవకాశం లేదంటూ ఎవరి నోట్లో వారేమైనా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మా సినిమాపై ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోంది,” అని రత్నం వ్యాఖ్యానించారు.
2020లో ప్రారంభమైన సినిమా, 2025లో విడుదల
ఈ చిత్రం 2020లో ప్రారంభమై, కరోనాతో సహా అనేక కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. 2025 జులై 24న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కోసం రత్నం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. బడ్జెట్ పెరుగుదల, కాస్ట్యూమ్‌లు, సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలపై భారీగా ఖర్చు పెట్టారు. దీన్ని గురించి ఆయన ఇలా అన్నారు:
“ఒక సినిమా సెట్స్ మీదే ఏళ్ల తరబడి ఉండడం నిర్మాతకి ఎంత mentally draining అనేది నాకే తెలుసు. కానీ ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే ఇన్నాళ్లూ సహించాను. ఇప్పుడు విడుదల సమీపిస్తున్న తరుణంలో కావాలనే అడ్డుపడేలా ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నా.”
“ప్యాషన్ కోసం తీసిన సినిమా ఇది, డబ్బుల కోసం కాదు”
ఏఎం రత్నం మాట్లాడుతూ, “నాకు డబ్బులే ముఖ్యమైతే పవన్ కళ్యాణ్‌తో రెండు మూడు కమర్షియల్ సినిమాలు తీయొచ్చు. కానీ ఇది ఒక ప్యాషన్ ప్రాజెక్ట్. ఒక గంభీరమైన కథను, పవన్ కళ్యాణ్ వంటి స్టార్‌తో ప్రజల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం. కానీ మా సినిమాను సినీ పరిశ్రమగా లేదా రాజకీయంగా కావాలనే టార్గెట్ చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది” అన్నారు.
‘బిజినెస్ జరగలేదు’ అనే ప్రచారం అసత్యం
“ఒక సినిమాకి డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఏరియాల వారీగా ఫిగర్ చెబుతారు, బేరసారాలు జరుగుతాయి. ఇది ప్రతి సినిమాలో జరిగేదే. కానీ దాన్ని బూతద్దంలో చూపిస్తూ ‘బిజినెస్ జరగలేదు’ అంటున్నారు. ఇది చాలా చెత్తగా, న్యాయవిరుద్ధంగా ఉంది,” అని అన్నారు.
ఫైనల్‌గా…
ఈ సినిమా కోసం ఏఎం రత్నం ఎంతో త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్‌కు చారిత్రక పాత్రల్లో ఇది కీలక సినిమా. విడుదలకు కొన్ని రోజులు మిగిలి ఉన్న ఈ దశలో, తప్పుడు ప్రచారాలు, కుతంత్రాలు సినిమాను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయనేది రత్నం వాదన. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ ఇంటర్వ్యూలో గళం విప్పారు.



