తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి కేంద్రంగా మారిన నీటి రాజకీయం!
ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న సమావేశం కీలక మలుపులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీకి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నేతృత్వం వహిస్తున్నది. నీటి పంపకాలే ప్రధాన అజెండాగా ఉంచుకుని ఈ సమావేశానికి రంగం సిద్ధమైంది.
ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్న అంశం — పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు. ఇదే ఏకైక అజెండాగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తొమ్మిది అంశాలను చర్చకు తీసుకురావాలని కోరింది. తెలంగాణ తరపున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాలను కేంద్రానికి పంపించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 10 అంశాల అజెండాను సిద్ధం చేసింది. వాటిలో పోలవరం-బనకచర్ల అనుసంధానం అంశం మొదటిది.
అయితే, ఈ బనకచర్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. గతంలో జరిగిన పరిణామాలు, కేంద్రంలోని వివిధ అధికారులతో జరిగిన చర్చలు, మాజీ జలశక్తి మంత్రి ఉమా భారతి హయాంలో జరిగిన మొదటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నోట్స్, తరువాత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన రెండో సమావేశం వివరాలను పరిశీలిస్తూ తెలంగాణ దీన్ని అసంబద్ధమైన అంశంగా అభివర్ణిస్తోంది.
ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన లేఖలో పేర్కొన్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. సంబంధిత అధికారుల, న్యాయనిపుణుల సహకారంతో ఈ అంశంపై సవివరంగా అధ్యయనం చేసిన చంద్రబాబు.. గత నిర్ణయాల తాలూకు డాక్యుమెంట్లు కూడా సమకూర్చుకున్నారు.
గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల పై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. దీంతో, ఈ సమావేశంలో పోలవరం-బనకచర్ల అంశంపై చర్చ తీవ్రతరం కావచ్చని వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తంగా ఈ భేటీ.. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై భవిష్యత్ దిశను నిర్ధారించేదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.



