మంగళగిరి:
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి, పోలవరం సహా పలు నిర్మాణాలు జెట్ స్పీడుతో సాగుతున్నాయని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో రాష్ట్రం 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు.
మంగళవారం మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ… రాష్ట్రం ఇప్పుడు శాంతియుతంగా ఉందని, పేదల కోసం సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని అన్నారు. కాగా, వైసీపీ నేత పేర్ని నాని తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పేర్ని నాని పార్టీకి ఊపిరి పూయాలని మళ్ళీ గంజాయి నీళ్లు పోస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన చేపల చెరువులు, హైవేలు, ప్రభుత్వ భూములపై అక్రమంగా కబ్జాలు చేశారని ఆరోపించారు.
“పేదల నోటి కాడి బియ్యాన్నీ దోచుకున్న నీచుడు పేర్ని నాని,” అని విమర్శించిన ఆమె, తన భార్యను కూడా తన పాపానికి ముద్దాయిగా మార్చాడని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ మహిళలను రాజకీయ బలిపశువులుగా మార్చడం ద్వారా కులవివాదాలు రెచ్చగొట్టాలని జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
అంతేకాక, బీసీలపై మాట్లాడే హక్కు వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో అమర్నాథ్ గౌడ్‌ను బైఠగించి తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకున్నారా? ఆయన కుటుంబాన్ని ఆదుకున్నది చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు.
గౌతు శిరీషాపై వేసిన అక్రమ కేసులు, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ జగన్ పాలన దుర్మార్గమైనదని అన్నారు.
“పేర్ని నాని తన భార్య ఆత్మాభిమానం కాపాడలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడు మహిళల గౌరవంపై మాట్లాడటం సిగ్గుచేటు,” అని తీవ్రంగా స్పందించారు.
గుడివాడను క్యాసినో నగరంగా మార్చిన పేర్ని నానిని ప్రశ్నిస్తూ, ఇప్పుడు గుడివాడ అభివృద్ధి చెందుతోంది కూటమి పాలనలో అని ఆమె తెలిపారు. వైసీపీ మళ్ళీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని, రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు కలిగించవద్దని సూచించారు.



