‘రవణం’పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. బన్నీ-ప్రశాంత్ నీల్ కాంబో కన్ఫర్మ్!

allu-arjun-prashanth-neel-ravanam-movie-dil-raju-clarifies

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అదే విధంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే ప్రచారం జరిగినా, అది కూడా అనిశ్చితిలో పడింది.

ఈ నేపథ్యంలో మరో క్రేజీ కాంబినేషన్‌గా అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ ల కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిపై స్పష్టత ఇచ్చారు.

‘రవణం’ – మాస్ కాంబోలో కొత్త సినిమా

దిల్ రాజు మాట్లాడుతూ, “ప్రశాంత్ నీల్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘రవణం’ అనే సినిమాను మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించబోతున్నాం. కానీ ఇది ఇప్పట్లో కాదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘సలార్ 2’. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే ‘రవణం’ సెట్స్‌పైకి వస్తుంది,” అని వెల్లడించారు.

బన్నీ సినిమాల స్పీడ్ పెరుగుతోంది

ఇప్పటికే బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోందని టాక్. ఇది నిజమైతే దేశంలోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. మరోవైపు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

దిల్ రాజు – బన్నీ బాంధవ్యంపై విశ్వాసం

అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్‌లో గతంలో ‘ఆర్య’, ‘పరుగు’, ‘డీజే’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘ఐకాన్’ ప్రాజెక్ట్ ముళ్లబాటుపడగా, ఆ కథను మరో హీరోతో తెరకెక్కిస్తామని దిల్ రాజు ఇప్పటికే వెల్లడించారు.

తమ్ముడు ప్రెస్‌మీట్‌లో వివరణ

నితిన్ హీరోగా రూపొందిన ‘తమ్ముడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన సోదరుడు శిరీష్ ‘గేమ్ ఛేంజర్’పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “తమ్ముడు ప్రమోషన్లలో ఉన్నప్పుడు, మీరు ‘గేమ్ ఛేంజర్’ గురించి ఎందుకు అడుగుతారు?” అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి