విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ 137 రోజుల రిమాండ్ అనంతరం విజయవాడ సబ్ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. ఆయనపై నమోదైన మొత్తం 11 క్రిమినల్ కేసుల్లోనూ కోర్టుల్లో ఊరట లభించడంతో ఆయన విడిపోగా, సుదీర్ఘ అనుమానాల అనంతరం వాస్తవంగా విడుదలపై స్పష్టత వచ్చింది.
వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఫిబ్రవరి 13న హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్‌మెంట్ నుంచి అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి కేసుల్లో అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అరెస్టు అనంతరం విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో వంశీ విజయవాడ సబ్ జైలుకు తరలించబడ్డారు.
అప్పటి నుంచి 137 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. ఇటీవల నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చివరి కేసులోనూ ఊరట లభించింది. దీంతో ఆయన విడుదలపై చర్చలు ఊపందుకున్నాయి.
అయితే, అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. “195 కోట్ల విలువైన అక్రమ మైనింగ్ జరిగింది. దీనిపై పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వగలము,” అని తెలిపారు.
కానీ, సుప్రీంకోర్టు వాదనలపై తాత్కాలిక నిర్ణయం తీసుకోకుండా, మైనింగ్ విలువపై నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణ జులై 16కు వాయిదా వేసింది. ఈ పరిణామాలతో వంశీ విడుదలకు మార్గం సాఫీ అయ్యింది.
జైలు గేటు వద్ద వైసీపీ శ్రేణులు, ముఖ్య నాయకులు వంశీ భార్యతో పాటు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన వంశీని చూసిన భార్య భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వంశీ నూజివీడు కోర్టుకు బయలుదేరారు.