దేశ భద్రతకు ముప్పు: పంజాబ్‌లో ఎయిర్‌ఫోర్స్ రన్‌వే కుంభకోణం – తల్లీకొడుకులు నకిలీ పత్రాలతో అమ్మకం
పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో దేశ భద్రతను బలహీనపరిచే విధంగా జరిగిన ఒక భారీ భూ కుంభకోణం 28 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. దేశానికి కీలకమైన ఎయిర్‌ఫోర్స్ రన్‌వేను తల్లి, కొడుకు కలిసి నకిలీ పత్రాల ద్వారా విక్రయించడం గలికీ ఆందోళన కలిగిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అధికారుల ప్రమేయం కూడా ఈ మోసంలో ఉన్నట్టు గుర్తించబడింది.
రన్‌వే నేపథ్యం
ఫిరోజ్‌పూర్‌లోని ఫట్టువాలా గ్రామంలో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మక ఎయిర్‌స్ట్రిప్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం 1945లో కొనుగోలు చేసింది. ఆపై ఇది భారత వాయుసేన ఆధీనంలో ఉంది. 1962, 1965, 1971 యుద్ధాల్లో ఈ ఎయిర్‌స్ట్రిప్ దేశ రక్షణకు కీలకంగా నిలిచింది.
నకిలీ పత్రాలతో విక్రయం
1997లో ఉషా అన్సల్ అనే మహిళ, ఆమె కొడుకు నవీన్ చంద్ కొందరు ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ రన్‌వే తమదేనని నకిలీ పత్రాలు సృష్టించి, భూమిని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. విచారణలో, అసలు యజమాని మదన్ మోహన్ లాల్ 1991లోనే మరణించారని బయటపడింది. అయినా, ఆయన పేరుతో 1997లో లావాదేవీలు జరిగాయన్నది కోణాన్ని మరింత అనుమానాస్పదంగా చేసింది.
చర్యలు లేక నిర్లక్ష్యం
విశ్రాంత రెవెన్యూ అధికారి నిషాన్ సింగ్ ఈ విషయం మొదట ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోలేదు. 2021లో హల్వారా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ లేఖ రాసినా స్పందన రాలేదు. దీంతో నిషాన్ సింగ్ హైకోర్టును ఆశ్రయించగా, పంజాబ్ హర్యానా హైకోర్టు దీనిని దేశ భద్రతకు ముప్పుగా పరిగణించింది.
హైకోర్టు ఆగ్రహం – విచారణ వేగం
హైకోర్టు ఆదేశాలతో పంజాబ్ విజిలెన్స్ బ్యూరో జూన్ 20న నివేదిక సమర్పించింది. అనంతరం ఉషా అన్సల్, నవీన్ చంద్ పై కేసు నమోదైంది. మే 2025లో భూమిని తిరిగి రక్షణ మంత్రిత్వ శాఖకు అప్పగించారు. డీఎస్పీ కరణ్ శర్మ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. మరిన్ని అధికారులు, వ్యక్తులు ఇందులో పాలుపంచుకున్నారని అనుమానంతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.