మోదీ టూర్‌తో భారత్-కెనడా సంబంధాల్లో కొత్త దశ.. పరస్పర దౌత్య సేవల పునరారంభానికి గ్రీన్‌సిగ్నల్!

ఢిల్లీ/అల్బెర్టా:
గత రెండు సంవత్సరాలుగా ప్రతికూలంగా సాగిన భారత్-కెనడా సంబంధాల్లో ఇప్పుడు కొత్త జోష్‌ కనిపిస్తోంది. జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కెనడా పర్యటన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించే దిశగా రెండు దేశాలు ముందడుగు వేసాయి.

2023లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై ఆరోపణలు చేసిన అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వల్ల ఏర్పడిన దౌత్య ఉద్రిక్తతలు అప్పట్లో తీవ్ర స్థాయికి చేరాయి. ఫలితంగా దౌత్యాధికారులపై పరస్పర నిషేధాలు, సంబంధాలపై ప్రభావం కనిపించింది. కానీ, ట్రూడో స్థానాన్ని మార్క్ కార్నీ భర్తీ చేయడం, తాజా రాజకీయ మార్పులు.. ఇప్పుడీ పరిస్థితిని మేలు దిశగా మలుస్తున్నాయి.

జీ7 సదస్సులో భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన భేటీ కీలకంగా మారింది. ఈ సమావేశంలో పూర్వపు ఉద్రిక్తతలకు తెర వేసేలా, రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి దౌత్య సేవలు పునరుద్ధరించేందుకు అంగీకరించారు. కొత్త హై కమిషనర్లను నియమించేందుకు రెండు దేశాలు సిద్ధమయ్యాయి.

కెనడా ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో – పరస్పర గౌరవం, చట్టపాలన, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత వంటి విలువలకు కట్టుబడి దేశాలు పని చేస్తాయని తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక బంధం, వ్యాపార భాగస్వామ్యం, ఇండో-పసిఫిక్ భాగస్వామ్యాలు, సరఫరా గొలుసులు, ఇంధన మార్పిడి వంటి అంశాలపై కూడా నేతలు చర్చించారు.

ఇంకా జీ7 సమావేశం ఎజెండాలో భాగంగా అంతర్జాతీయ నేరాలు, భద్రత, నియమాల ఆధారిత వరల్డ్ ఆర్డర్ వంటి అంశాలను కూడా మార్క్ కార్నీ ప్రస్తావించారు. టెక్నాలజీ, డిజిటల్ మార్పులు, ఆహార భద్రత, ముఖ్య ఖనిజాల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చలు జరిగాయి.

అయితే, ఇప్పటికీ కెనడాలో భారత వ్యతిరేక శక్తులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఖలిస్థానీ మద్దతుదారుల కదలికలపై మోదీ ప్రభుత్వం పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అలాంటి శక్తులపై కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ కోరుతోంది.

ఈ నేపథ్యంలో తాజా సమావేశం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్చలు కొత్త దారులు తెరవనున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి