వయసు అడ్డంకి కాదు… 71 ఏళ్ల లీలా జోస్ స్కైడైవింగ్ రికార్డు

“కలలకి వయసు అడ్డుకాదు” అన్న నానుడిని నిజం చేసిన ఉదాహరణగా నిలిచారు కేరళకు చెందిన 71 ఏళ్ల లీలా జోస్. చిన్నప్పటి నుంచి ఆకాశంలో పక్షిలా విహరించాలని కలలుగన్న ఈమె, దశాబ్దాల తర్వాత తన కలను సాకారం చేసుకున్నారు. ఏకంగా 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి రాష్ట్రంలో అత్యధిక వయసులో ఈ సాహసం చేసిన మహిళగా రికార్డులో నిలిచారు.

చిన్ననాటి కలకు సాకారం

కేరళలోని ఇడుక్కి జిల్లా కొన్నతడి గ్రామానికి చెందిన లీలా జోస్ చిన్ననాటి నుంచే విమానాలను ఆసక్తిగా గమనించేవారు. ఇంటి పైకప్పు మీద నుంచి ఆకాశంలో ఎగిరే విమానాలను చూసిన ప్రతిసారీ ఆమె మనసులో స్కైడైవింగ్ చేయాలనే తపన కలిగేది. ఆ కలను స్నేహితులతో పంచుకున్నప్పుడు వారు సరదాగా నవ్వినా, ఎగతాళి చేసినా… లీలా మాత్రం తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.

ఇది కూడా చదవండి

కుమారుడి ప్రోత్సాహం

ఇటీవల దుబాయ్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు పి. అనీష్‌ను కలిసేందుకు వెళ్లిన లీలా తన కోరికను వ్యక్తం చేశారు. మొదట తల్లి మాటలను సీరియస్‌గా తీసుకోని అనీష్, ఆమె పట్టుదల, నిశ్చయాన్ని గమనించి స్కైడైవింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు.

ఈ సాహసం కోసం విమానం, ప్రొఫెషనల్ గైడ్, వీడియో రికార్డింగ్ తదితరాలతో కలిపి రూ. 2 లక్షలు ఖర్చయింది. అనుభవజ్ఞుడైన ట్రైనర్‌తో కలిసి ఆమె టాండమ్ జంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

“గాల్లో తేలిన అనుభూతి”

తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ లీలా చెప్పారు:

“గాల్లో తేలిపోతున్నప్పుడు ఒకేసారి భయం, ఆనందం కలిశాయి. ఆ క్షణంలో నా శరీరం బరువును పూర్తిగా మర్చిపోయాను. 6,000 అడుగుల ఎత్తులో పారాచూట్ తెరచుకున్నప్పుడే సురక్షితంగా దిగుతాననే నమ్మకం కలిగింది.”

స్నేహితుల ప్రశంసలు

తిరిగి స్వగ్రామానికి చేరుకున్న లీలా తన స్కైడైవింగ్ ఫోటోలు, వీడియోలను స్నేహితులకు చూపించగా, వారు మొదట ఆశ్చర్యపోయి తర్వాత ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. “నా ధైర్యానికి స్ఫూర్తి నా తండ్రే. ఆయన ఆర్మీ అధికారి మాణీకుట్టి. ఆయన నుంచి నేర్చుకున్న నిబద్ధతే నన్ను ఈరోజు ఇక్కడికి తెచ్చింది” అని లీలా గర్వంగా తెలిపారు.

ఇది కూడా చదవండి

అంతరిక్షం తదుపరి కల!

తన తర్వాతి లక్ష్యం ఏమిటని అడగగా, లీలా నవ్వుతూ చెప్పారు:

“సాధ్యమైతే అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నాను. నా వయసు అడ్డంకి కాదనుకుంటే, నా కోరికను ఇస్రో పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను.”

వయసును సవాలు చేసే మహిళలు

ఇటీవల హర్యాణాలో 80 ఏళ్ల డాక్టర్ శ్రద్ధా చౌహాన్ కూడా 10,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి రికార్డు సృష్టించారు. లీలా, శ్రద్ధా వంటి మహిళలు వయసుతో సంబంధం లేకుండా కలలు సాకారం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు. వీరి సాహసాలు సమాజానికి స్ఫూర్తినిస్తూ, “ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా సాధ్యమే” అనే సందేశాన్ని అందిస్తున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి