48 ఏళ్ల తర్వాత ప్రేమ నేరం వెలుగులోకి – 81 ఏళ్ల తాత అరెస్ట్‌

తా తా! ఈ జన్మకే టైం కుదిరింది అనుకోవాలి! కోర్టుకి రా! అని పిలిచేసింది న్యాయం!
ఒకప్పుడు 23 ఏళ్ల లవర్‌బాయ్‌గా కత్తి ఊపిన చంద్రశేఖర్‌ మధుకర్‌ కాలేకర్‌, ఇప్పుడు 81 ఏళ్ల వయసులో తాతగారిగా పోలీసుల చేతిలో చిక్కాడు. ప్రేమించిన అమ్మాయిని కత్తితో పొడిచిన కేసులో దాదాపు 48 ఏళ్లు తప్పించుకుని చివరికి పట్టుబడ్డాడు.


ప్రేమ, అనుమానం, నేరం…

సంవత్సరం – 1977.
స్థలం – ముంబై కొలాబా.
చంద్రశేఖర్‌ తన ప్రేయసిపై అనుమానం పెంచుకున్నాడు. ఆ కోపంతో, ఆవేశంతో ప్రేమనే నేరంగా మార్చాడు. కత్తితో పొడిచి ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. పోలీసులు వెంటనే అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బెయిల్‌ మంజూరు చేయగానే, కాలేకర్‌ గారు “ట్రయల్‌ బై ఎస్కేప్‌” అనే కొత్త కాన్సెప్ట్‌ కనిపెట్టి… కనిపించకుండా మాయమైపోయారు!


48 ఏళ్ల సన్యాస జీవితం!

దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు పోలీసులకు దొరకకుండా జీవించాడు. ముంబై పోలీసులు వెతికారు, వారెంట్‌లు జారీ చేశారు, కానీ ఆచూకీ దొరకలేదు. ఆయన నివసించిన భవనం కూలిపోయింది, అడ్రస్‌ మారింది. కేసు ఫైల్‌ కోర్టు మూలన దుమ్ము తినసాగింది.
అంతలో… అనుకోని క్లూ దొరికింది!


కర్మ వెంబడించింది!

2015లో రత్నగిరి జిల్లా దాపోలి పోలీస్‌ స్టేషన్‌లో ఓ ప్రమాదం కేసులో చంద్రశేఖర్‌ మధుకర్‌ కాలేకర్‌ పేరు నమోదైంది.
అదే చాలు!
కొలాబా పోలీసులు కేసు ఫైల్‌ తిరగేసి, క్లూ వెంబడి వెళ్ళి చివరకు తాతగారిని పట్టేశారు. పాత ఫొటోలు చూసి, వయసు మారినా ముఖంలో ఉన్న కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించారు.


కోర్టు ముందు 81 ఏళ్ల నిందితుడు

తన వయసు 81 ఏళ్లు, అనేక వ్యాధులతో బాధపడుతున్నానని అడ్వకేట్‌ సునీల్‌ పాండే కోర్టులో వాదించారు.
“సార్‌, నా క్లయింట్‌కు 48 ఏళ్ల క్రితం జరిగిన నేరం గుర్తు లేదు. చార్జిషీట్‌ తర్వాత ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. 2010లో ఆయన గుడిసె పడిపోయింది, ఆసుపత్రిలో ఉన్నారు” అని జాలి పుట్టించే విధంగా చెప్పేశారు.

ప్రభుత్వ తరపు న్యాయవాది ఆనంద్‌ సుఖదేవే మాత్రం,
“ఇది తీవ్రమైన నేరం! విచారణను 48 ఏళ్లు వాయిదా వేసింది ఈయనే! మళ్లీ పారిపోవచ్చు!” అని అభ్యంతరం తెలిపారు.

కానీ న్యాయమూర్తి అవినాష్‌ పి. కులకర్ణి గారు తాతగారి వయసు, ఆరోగ్యం చూసి జాలి పడ్డారు. ఆయన ఇచ్చిన హామీతో సంతృప్తి చెంది, మళ్లీ బెయిల్‌ మంజూరు చేశారు.


“తాతగారు హ్యాపీ!”

ప్రేమించి, పొడిచి, పారిపోయి… చివరికి వృద్ధాప్యంలో పట్టుబడిన చంద్రశేఖర్‌ ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నాడు.
48 ఏళ్ల తర్వాత ఇప్పుడు విచారణ మొదలుకానుంది.
అయితే అప్పటి సాక్షులు, ఆ ప్రేయసి, ఆ రోజుల్లో కేసు చూసిన పోలీసులు — ఎవరైనా ఇంకా బతికే ఉన్నారో తెలియదు.


న్యాయవ్యవస్థకు సలామ్‌

ఇంతకాలం కేసు ఫైల్‌ను సంరక్షించిన కోర్టు సిబ్బంది, పోలీసులు అభినందనీయులు.
దాదాపు అర శతాబ్దం తర్వాత ఒక ప్రేమ నేరం మళ్లీ న్యాయస్థానం ఎదుటకి రావడం భారత న్యాయ చరిత్రలో అరుదైన సంఘటన.

మరి ఇప్పుడు ప్రశ్న —
ఈ కేసు విచారణ ఇంకో 48 ఏళ్లు సాగుతుందా… లేక ఈసారి నిజంగా తీర్పు వస్తుందా?


Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి