సౌరవ్యవస్థలోకి దూసుకొస్తున్న ‘3ఐ/అట్లాస్’ తోకచుక్క – భూమికి ప్రమాదమా? నాసా వివరణ

మన సౌరవ్యవస్థ వైపు వేగంగా దూసుకొస్తున్న కొత్త తోకచుక్క ‘3ఐ/అట్లాస్’ (3I/ATLAS) భూమికి ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) స్పష్టంచేసింది. ఈ తోకచుక్క సెకనుకు 61 కిలోమీటర్ల వేగంతో (గంటకు సుమారు 2.21 లక్షల కిలోమీటర్లు) విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ, దాని దిశ, మార్గం, మరియు దూరం ఆధారంగా భూమికి ఎటువంటి ముప్పు లేదని నాసా తెలిపింది.

నాసా శాస్త్రవేత్తల ప్రకారం, ఇది మన సౌరవ్యవస్థకు వెలుపల నుంచి వచ్చిన మూడో అంతర్‌నక్షత్ర వస్తువు. ఇంతకుముందు 2017లో ‘ఔమువామువా (ʻOumuamua)’, 2019లో ‘2ఐ/బోరిసోవ్ (2I/Borisov)’ వంటి వస్తువులను కనుగొన్నారు. ఇప్పుడు గుర్తించిన 3ఐ/అట్లాస్ కూడా వాటిలాగే సౌరవ్యవస్థ బయటి ప్రాంతం నుండి వచ్చిన ఆకాశ అతిథిగా భావిస్తున్నారు. దీని పేరులోని ‘ఐ (I)’ అక్షరం ఇంటర్‌స్టెల్లార్ (Interstellar) — అంటే నక్షత్రాల మధ్య ప్రాంతం నుండి వచ్చింది అని సూచిస్తుంది.

ఈ తోకచుక్కను తొలిసారిగా ఈ సంవత్సరం జూలై 1న చిలీ దేశంలోని రియో హర్టాడోలో ఉన్న ‘అట్లాస్’ (Asteroid Terrestrial-impact Last Alert System) అనే టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కదలికలను నాసా ప్రస్తుతం హబుల్ స్పేస్ టెలిస్కోప్ మరియు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వంటి శక్తివంతమైన పరికరాల ద్వారా నిరంతరం గమనిస్తోంది.

నాసా విడుదల చేసిన వివరాల ప్రకారం, 3ఐ/అట్లాస్ సూర్యుడి వైపు క్రమంగా దగ్గరవుతుండగా, దాని వేగం మరింతగా పెరుగుతుందని అంచనా. అక్టోబర్ 30 నాటికి ఇది సూర్యుడికి అత్యంత సమీప దూరమైన సుమారు 21 కోట్ల కిలోమీటర్లు దూరంలోకి వస్తుంది. ఇది అంగారక గ్రహ కక్ష్య కంటే కొద్దిగా లోపల భాగంలో ఉంటుంది.

భూమికి ఇది అత్యంత దగ్గరగా వచ్చే సమయంలో కూడా, దాని దూరం సుమారు 27 కోట్ల కిలోమీటర్లు (1.8 ఆస్ట్రానామికల్ యూనిట్లు) ఉండనుంది. అందువల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టంగా ప్రకటించింది.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ తోకచుక్క అక్టోబర్ చివరిలో సూర్యుడి వెనుకుగా వెళ్లి, మార్చి 2026 నాటికి బృహస్పతిని దాటి, తిరిగి మన సౌరవ్యవస్థను శాశ్వతంగా విడిచిపోతుంది. ఈ అంతర్‌నక్షత్ర అతిథి తన విశేష ప్రయాణంతో ఖగోళ శాస్త్రవేత్తలకు మరో కొత్త అధ్యయన అవకాశాన్ని అందించనుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి