అది ఒక ఆదివారం ఉదయం. క్రిస్మస్ సంబరాల మరుసటి రోజు కావడంతో దేశమంతా సెలవు హడావుడిలో మునిగిపోయింది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు సిద్ధమవుతుంటే, పర్యాటకులు అలల శబ్దాన్ని ఆస్వాదిస్తూ తీరాన సంబరపడుతున్నారు. అంతా సజావుగా సాగుతున్న ఆ ఉదయం… సరిగ్గా 8:00 గంటలకు ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయానక ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా నిలిచే ఘట్టానికి నాంది పలికింది.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం సమీపంలో సంభవించిన 9.1 తీవ్రత గల భూకంపం భూగోళాన్ని గడగడలాడించింది. నిమిషాల వ్యవధిలోనే ప్రశాంతంగా కనిపించిన సముద్రం ఉగ్రరూపం దాల్చింది. క్షణాల్లోనే అలలు రాక్షసుల్లా ఎదిగి, తీరప్రాంతాల వైపు విరుచుకుపడ్డాయి.
14 దేశాలు.. లక్షలాది ప్రాణాలు ఈ సునామీ ధాటికి ఒక్క భారత్ మాత్రమే కాదు, ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేషియా సహా మొత్తం 14 దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల 30 వేల మంది సముద్ర గర్భంలో కలిసిపోయారు. బుల్లెట్ రైలు కంటే వేగంగా దూసుకొచ్చిన అలలు కేవలం నిమిషాల్లోనే నగరాలు, గ్రామాలను శ్మశానాలుగా మార్చేశాయి. వేల ఏళ్లుగా మానవ నివాసాలుగా ఉన్న ప్రాంతాలు కళ్లముందే కనుమరుగయ్యాయి.
భారత్‌లో మృత్యుఘోష ◆ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలు మరియు అండమాన్–నికోబార్ దీవులు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.
◆ ఒక్క భారత్‌లోనే దాదాపు 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
◆ ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 301 తీర గ్రామాలు జలమయమయ్యాయి.
◆ మన రాష్ట్రంలో సుమారు 105 మంది ఈ ప్రకృతి ప్రళయానికి బలయ్యారు.
◆ సరదాగా సముద్ర తీరానికి వెళ్లిన పర్యాటకులు, జీవనోపాధి కోసం వేటకు వెళ్లిన గంగపుత్రులు తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు.
నేటికీ ఆరని గాయాలు సునామీ విపత్తుకు 21 సంవత్సరాలు గడిచినా, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ బాధితుల మనసులను కలచివేస్తూనే ఉన్నాయి. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథలు, సర్వస్వం కోల్పోయిన కుటుంబాల కళ్లలో కన్నీరు ఇంకా ఆరకుండా ఉంది.
“సముద్రం ఒక్కసారిగా ముందుకు వస్తుంటే ఏదో వింత అనుకున్నాం… కానీ అది మా జీవితాలనే కొట్టుకుపోతుందని ఊహించలేదు” అని ఇప్పటికీ బాధితులు వేదనతో చెబుతుంటారు.
నేర్చుకున్న పాఠం… ఆనాడు సునామీ హెచ్చరిక వ్యవస్థలు లేకపోవడం వల్లే నష్టం మరింత పెరిగింది. ఆ చేదు అనుభవం నుంచే భారత్ పాఠం నేర్చుకుంది. అనంతరం ‘సునామీ వార్నింగ్ సెంటర్’ ఏర్పాటు చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విపత్తు నిర్వహణలో బలపడింది.
ప్రకృతి ఒక్కసారి కన్నెర్ర చేస్తే మానవుడు ఎంత అల్పుడో గుర్తుచేసే ఘట్టమే 2004 సునామీ. ఆ మహాప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ఆత్మలకు మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం.



